హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిది: ముఖ్యమంత్రి

సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి  పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిది. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణం.

హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారు. ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారు.
ఇప్పుడు మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడండి. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచింది. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దాం.
ఏ శక్తులు అడ్డొచ్చినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంటుంది. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తాం.
యాదవులు రాజకీయంగా ఎదగాలనే యువకుడైన అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించాం. రాబోయే రోజుల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తాం.

సదర్ సమ్మేళనం వేడుకలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here