Andhra working towards enabling people to lodge complaints through WhatsApp

  • టెక్నాలజీ సాయంతో ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్
  • అన్ని వివరాలు అందులో నిక్షిప్తం
  • వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం
  • ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ ఏర్పాటు చేస్తున్నాం
  • దేశంలో ఒక ప్రభుత్వం ఇలా చేయడం ఇదే మొదటి సారి
  • ఏఐ, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం
  • జిల్లా కలెక్టర్లు కొత్త సమస్యలతో రండి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం
—ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్

అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్వరలో ఒక ప్రత్యేక ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈఓ కె. దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన అధునాతన సాంకేతికతల మేళవింపుతో పునర్నిర్వచించి ఆర్టీజీఎస్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అధునాతన సాంకేతిక సౌలభ్యాలతో ఆర్టీజీఎస్ పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖల్లో 4, 338 డేటా ఫీల్డులు ఉన్నప్పటికీ ఈ శాఖల మధ్య డేటా లింకేజీ ఇప్పటి వరకు లేదని, ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో లభ్యమయ్యే డేటాతో అనసంధానించేలా ఒక ప్రత్యేకమైన డేటా లేక్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా తనకంటూ ప్రత్యేకంగా ఒక డేటా లేక్‌ను ఏర్పాటు చేసుకోవడం దేశంలో ఇదే ప్రధమం అని చెప్పారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న మొత్తం డాటాను ఈ లేక్ లో నిక్షిప్తం చేస్తామన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు, డీప్ టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్ లాంటి అధునాతన సాంకేతిక సౌలభ్యాలతో నిరంతరం విశ్లేషించి పాలన మరింత సులభతరమయ్యేలా చేస్తామన్నారు. పాలనలో క్షేత్రస్థాయిలో ఎదరుయ్యే వినూత్న సమస్యలపై పరిష్కార మార్గాలను టెక్నాలజీ ద్వారా విశ్లేషించి రియల్ టైమ్ పరిష్కారాలను సూచించేలా చేస్తామన్నారు. స్మార్ట్ గవర్నమెంటు, వర్చువల్ గవర్నెన్స్ అన్నది ముఖ్యమంత్రిగారి విధానమని, దానికి అనుగుణంగా ఆర్టీజీఎస్ అన్ని శాఖలతో అనుసంధానమై పనిచేస్తుందన్నారు. డేటా లేక్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేస్తామని, అందులో ఆ గ్రామ సమగ్ర స్వరూపం ఉంటుందని, అక్కడి సమస్యలతో సహా వివరాలు జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సులభంగా తెలిసేలా రూపొందిస్తామన్నారు. తద్వారా ఆ గ్రామంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది ప్రజలకు సులభతరమవుతుందన్నారు.
వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు
పౌరులు తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వాధికారులకు, ప్రభుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే సరికొత్త సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నామని తెలిపారు. వాట్సాప్‌లో తమ ఫిర్యాదు టైపు చేయలేకపోయినా కేవలం వారు తమ వాయిస్ రికార్డు చేసి పంపితే ఫిర్యాదుగా స్వీకరించే విధానం అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్టీజీఎస్ మెటా సంస్థతో కలిసి పనిచేస్తోందన్నారు. త్వరలోనే ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీజీఎస్ తో ఇటీవలే గూగల్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని, గూగుల్ సహకారంతో పాలనలో మరింత సాకేతిక సౌలభ్యాలు తీసుకొస్తున్నామన్నారు. శాటిలైట్ ద్వారా రాష్ట్రంలో ఏఏ ప్రాంతంలో గంజాయి సాగుతుందనే ప్రాంతాలను గుర్తించి, అక్కడికి డ్రోన్లు పంపి వాస్తవ పరిస్తితిని విశ్లేషించి గంజాయి సాగుని అరికట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి సర్వేలియన్స్ కెమెరాల ద్వారా పలు విశ్లేషణలు చేయనున్నామన్నారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ సరిగ్గా చేశారా లేదా అనేది కెమెరాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సుతో విశ్లేషించవచ్చని తెలిపారు.

కలెక్టర్లు కొత్త సమస్యలతో రండి

రియల్ టైమ్‌లో సమస్యల పరిష్కారాల కోసం ఆర్టీజీఎస్‌లో ఏఐ, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని జిల్లా కలెక్టర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లకు, అధికారులకు ఎదురయ్యే కొత్త సమస్యలను కలెక్టర్లు ఆర్టీజీఎస్ కు తీసుకొస్తే వాటిని విశ్లేషించి రియల్ టైమ్ లో పరిష్కార మార్గాలను కనుగొంటామని చెప్పారు. జిల్లాలో ఆర్టీజీ కేంద్రాలను మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here